భారత స్వాతంత్ర్య పోరాటంలోని అజ్ఞాత చరిత్ర యొక్క సంగ్రహావలోకనం - భాగం 10

భారత స్వాతంత్ర్య పోరాటంలోని అజ్ఞాత చరిత్ర యొక్క సంగ్రహావలోకనం - భాగం 10

బ్రిటీష్ వారి గూఢచారి విభాగం అప్రమత్తమైంది. రాణి లక్ష్మీబాయి పాలనలో ఉన్న ఝాన్సీ రాజ్యానికి ఒకే వారంలో 50 మంది శిక్షణ పొందిన భారతీయ గూఢచారులను పంపారు. వారితో పాటు విస్తారమైన ధనసంపదను కూడా అందించారు.

ఝాన్సీ సంస్థానం 30-40 ఏళ్ల క్రితమే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఝాన్సీ రాజులు ప్రతి పనినీ బ్రిటీష్ వారు నియమించిన స్పెషల్ ఆఫీసర్ అనుమతితోనే చేయాల్సి వచ్చేది. ఝాన్సీ రాజు గంగాధర రావు వయసు 50 సంవత్సరాలు ఉండింది. అతని ఆరోగ్యం కూడ అంత బాగుండదు. ఇలాంటి స్థితి లో అతని వివాహము తాంబే వంశం లోని " మణికర్ణిక " పేరు గల అమ్మాయి తో జరిగింది. అపుడు మణికర్ణిక వయసు 8-9 సంవత్సరాలు. 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెను ఝాన్సీ తీసుక వచ్చారు. ఏడాది రెండు ఏళ్లలోనే ఆమెకు అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చింది.


పెళ్లి తర్వాత మణి కర్ణిక పేరును ‘లక్ష్మీబాయి’గా మార్చారు. రాణీ లక్ష్మీబాయి చిన్నతనంలోనే నానాసాహెబ్ పీశ్వా మరియు తాత్యా తోపే మొదలగు వారి తో యుద్ధ క్రీడలు ఆడుతుండేది. ఆమె నైపుణ్యాన్ని చూసి ఆమె తండ్రి పీష్వాల అనుమతితో నానాసాహెబ్‌తో పాటు యుద్ధ విద్యల్లో శిక్షణ పొందేలా ఏర్పాటు చేశారు. 7 నుండి 14 సంవత్సరాల వయసు వరకు అనగా మొత్తం ఏడు సం॥ రాలు యుద్ధ కళ మరియు రాజనీతి పాఠాలు నేర్చుకున్నది. తాత్యా తోపే, నానాసాహెబ్ ఇద్దరూ లక్ష్మీబాయి కంటే వయస్సులో పెద్దవారే అయినా, అప్పటికి వాళ్ళు కూడా చిన్నవారే. లక్ష్మీబాయి వారిద్దరికీ రాఖీలు కట్టేది.

ఝాన్సీ వాతావరణానికి అలవాటు పడటానికి ఆమెకు రెండేళ్లు పట్టింది. ఆ తర్వాత రాణి లక్ష్మీబాయి గుడికి వెళ్లడం, నగరంలోని ప్రముఖ మహిళలను కలవడం, ప్రజల కష్టాలను వినడం వంటి పనుల ద్వారా సమాజంలోని వివిధ వర్గాలతో మమేకం అవ్వడం మొదలుపెట్టింది. ఆమె రాణి కావడంతో, ఆమె ఆజ్ఞ ప్రకారం ప్రభుత్వ అధికారుల నుండి వ్యాపారుల వరకు అందరూ ఆమెను కలవడానికి రావాల్సిందే.

మెల్లమెల్లగా లక్ష్మీబాయికి ఒక విషయం అర్థమైంది. తన భర్త అనారోగ్యంతో ఉన్నా కూడా ఎంతో కష్టపడి రాజ్యాన్ని నడుపుతున్నారు, అయితే అతని వద్ద ఉన్న అధికారాలు చాలా పరిమితం. అతని రాజ్యం పేరుకు

మాత్రమే స్వతంత్ర రాజ్యం కాని ఆమె భర్తను బ్రిటిష్ సర్కారు అన్ని దిక్కుల నుంచి కట్టడి చేసి ఉంచింది.


అందువల్ల ఆమె రాజ్యంలో తిరుగుతున్నప్పుడు ప్రజల మనోభావాలను గమనించడం మొదలుపెట్టింది. బ్రిటీష్ వారికి లొంగిపోయిన గంగాధరరావు గారి సైనిక అధికారులు బ్రిటీష్ వారికే మద్దతు ఇస్తారని, తన లేదా రాజు గారి ఆజ్ఞను వారు వినరని ఆమెకు అర్థమైంది. అలాగే బ్రిటీష్ వ్యాపారాల్లో భాగస్వాములైన వ్యాపారులు కూడా బ్రిటీష్ వారికే అండగా ఉంటారని గ్రహించింది.

ఈ వాస్తవం తెలిసిన వెంటనే రాణి లక్ష్మీబాయి ఝాన్సీలోని రైతులు, గ్రామాలలోని వడ్రంగులు, కమ్మరి, కుమ్మరి ఈ రకంగా 12 రకాల పనులుచేసే పన్నెండు రకాల వృత్తుల వారితో. పోలాలలో పని చేసే కూలీలు ఇండ్ల నిర్మాణం చేసే పనివారు ఇలా సామాన్య ప్రజలతో సామాన్య విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టింది.

ఆమెకు సామాన్యులతో పరిచయాలు పెంచుకోవడంలో ‘ఝల్కారీబాయి’ అనే సేవకురాలు ఎంతో సహాయపడింది. ఆమె అప్పట్లో కోలీ సమాజానికి చెందిన స్త్రీ, ఆమెలోని ప్రతిభను లక్ష్మీబాయి గుర్తించింది. ఝల్కారీబాయి రాణి కంటే వయస్సులో పెద్దది, కానీ ఆమెకు చదువు రాయడం వచ్చు. రాణితో కలిసి యుద్ధ విన్యాసాలు చేయడం వల్ల ఆమెకు యుద్ధ విద్యలు కూడా బాగా వచ్చాయి. ఝాన్సీ సైన్యంలోని ఒక బ్రిటీష్ సోల్జర్‌కు లంచం ఇచ్చి, రాణీ లక్ష్మీబాయి ఝలకారీబాయి కి ఫిరంగీ శాల లో శుభ్రం చేసే పని ఇప్పించింది. ఆ సాకుతో ఆ బ్రిటీష్ అధికారి ఝల్కారీబాయికి ఫిరంగులు పేల్చడం, మందుగుండు సామాగ్రి వినియోగంపై ఒకటిన్నర ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చాడు. అప్పుడప్పుడు రాణి లక్ష్మీబాయి కూడా వేషం మార్చుకుని, ఝల్కారీబాయి సోదరిలా అక్కడికి వెళ్లి ఫిరంగి పేల్చడంలో, తుపాకీ కాల్చడంలో ప్రావీణ్యం సంపాదించింది.

ఇవన్నీ జరుగుతున్నప్పుడే లక్ష్మీబాయి గర్భవతి అయింది, ఆమెకు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఈ సమయాన్ని ఉపయోగించుకుని లక్ష్మీబాయి ప్రజలను వారి కుటుంబ సభ్యులతో వారి మహిళల తో కలువడానికి పిలుస్తుండేది.. దీనివల్ల ప్రజల ఆలోచనలు ఆమెకు బాగా అర్థమయ్యాయి.

ఒకరోజు ఏకాంతంలో లక్ష్మీబాయి ఝల్కారీబాయితో ఇలా అంది, "మన రాజ్యంలో ఒక్క నాగరికుడు కూడా సంతోషంగా లేడు. బ్రిటీష్ వారి జోక్యం వల్ల రైతులు, కూలీలు నలిగిపోతున్నారు. మనం ఏదో ఒకటి చేయాలి. మనం ఇద్దరం కలిసి సాహసవంతులైన స్త్రీల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేద్దాం. ఆడవాళ్లు ఇలాంటి పనులు చేస్తారని బ్రిటీష్ అధికారులకు అనుమానం కూడా రాదు." వెంటనే ఝల్కారీబాయి రంగంలోకి దిగింది, ‘దుర్గా దళము" స్థాపించ బడింది. ‘మోతీబాయి’ అనే స్త్రీ యుద్ధవిద్యల్లో మరియు గూఢచారి విభాగంలో నిపుణురాలైంది, ‘ముందర్ బేగం’ అనే ఆమె కుస్తీ నేర్చుకుని రాణికి అంగరక్షకురాలుగా మారింది.

వీరితో పాటు దివాన్ రఘునాథ్ సింగ్, లాలాభావూ బక్షీ వంటి అధికారులు రాణికి సహకరించడం మొదలుపెట్టారు. ‘ఖుదాబక్ష్ బషరత్ అలీ’ అనే మరో సైనిక అధికారి తన భార్యతో కలిసి ఈ పనిలో భాగస్వామి అయ్యాడు. కమలకుమారి చౌహాన్, రాజకుంవర్ యాదవ్ వంటి మధ్యతరగతి మహిళలు రాణిని తరచుగా కలిసేవారు.

సరైన సమయంలో లక్ష్మీబాయి ఒక కుమారుడికి జన్మనిచ్చింది. కాని చాలా చిన్న వయసులోనే ఆ కుమారుడు మరణించాడు. ఆ పుత్రశోకం నుండి బయటపడటంలో మోతీబాయి, ఝల్కారీబాయి, ముందర్ బేగం రాణికి ఎంతో తోడుగా నిలిచారు.

ఒకరోజు రాణి తన మహల్‌లో ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నప్పుడు, దూరంగా ఒక బ్రిటీష్ అధికారి 10 ,12 మంది జనులను క్రూరంగా కొట్టడం చూసింది. ఆరా తీయడానికి మోతీబాయిని పంపింది. మోతీబాయి రహస్యంగా సమాచారం సేకరించి రాణికి పంపేది. ఈ పనిలో ముందర్ బేగం, రాజకుంవర్ కూడా ఉండేవారు.


దుఃఖంలో ఉన్న రాణి చాలా సాదాసీదా బట్టల్లో ఉంది, ఒంటి మీద కనీసం ఒక్క నగ కూడా లేదు. రాజకుంవర్ వేగంగా మహల్‌లోకి వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నది ఝల్కారీబాయి అనుకుని, "ఝల్కారీ, రాణి మనల్ని గౌరవిస్తున్నారని చెప్పి నువ్వు రాణి ఆసనంపై కూర్చోవడమేంటి?" అని అడిగేసింది. ఆమె వెనుక వచ్చిన ముందర్ బేగంకు కూడా అలాగే అనిపించింది.

అప్పుడే వారికి మొదటిసారి తెలిసింది ఏంటంటే, సాదా వేషంలో ఉన్న లక్ష్మీబాయికి, ఝల్కారీబాయికి మధ్య అద్భుతమైన పోలికలు ఉన్నాయని.

ఆ బ్రటిష్ అధికారి చిన్న పొరపాటు కు మరియు పన్ను వసూలు చేయడానికి 10, 12 మందిని అమానుషంగా చాలా దండిస్తున్నాడు.

ఆ దాడిలో తండ్రి ఒడిలో ఉన్న ఒక చిన్న బాలుడు కూడా చనిపోయాడు.

ఈ విషయం తెలిసిన వెంటనే రాణి తన పుత్రశోకాన్ని పక్కన పెట్టి, మళ్ళీ దుర్గా దళ్ పనులను వేగవంతం చేసింది. ఝల్కారీబాయి భర్త ‘పురన్ సింగ్ కోరీ’ ఝాన్సీ సైన్యంలో ఒక చిన్న అధికారి. ఆయన మహిళలకు యుద్ధవిద్యలు నేర్పడం మొదలుపెట్టాడు. అనారోగ్యంతో ఉన్న రాజు గారికి చెప్పి పురన్ సింగ్‌ను తోపుఖానాలో ‘నాయక్’ పదవికి నియమించేలా చేసింది రాణి.

మెల్ల మెల్లగా దుర్గా దళ్‌లోని మహిళల సంఖ్య పెరుగుతూ పోయింది. రఘునాథ్ సింగ్ మార్గదర్శకత్వంలో రైతులు, కూలీలు కూడా సిద్ధమయ్యారు.

క్రీ. శ. 1856 విజయదశమి వరకు ఝాన్సీ రాణీ లక్ష్మీబాయి వద్ద దుర్గా దళములో రెండు వేల మంది మహిళా సైనికులు మరియు రఘునాథ సింహ తో కలసి పని చేసే "మహాదేవ శివ" సమితి సైనికులు తయారైనారు.

(కథ కొనసాగుతుంది)

Comments