సద్గురు శ్రీ బాపు కృప వల్ల నేను వారి సన్నిధికి చేరుకున్నాను మరియు శాశ్వతంగా వారి వాడిని అయ్యాను. ఈ సద్గురువుల అకారణ కరుణ నన్ను ఎన్నోసార్లు చిన్న పెద్ద ఆపదల నుండి కాపాడింది. సాక్షాత్తూ మృత్యువును సైతం వెనక్కి పంపి ఆయన నా భార్యకు (మానసికి) పునర్జన్మ ప్రసాదించారు.
నవంబర్ 16, 2000 వ రోజు, గురువారం అంటే బాపు ప్రవచనం ఉండే రోజు. మానసి ఇంట్లోనే ఉంది. నేను సాయంత్రం 4.45 గంటలకు ఆఫీసు నుండి బయలుదేరుతూ ఇంటికి ఫోన్ చేశాను. దాదర్‌లోని ఆంటోనియా డిసిల్వా హైస్కూల్‌కి (ప్రవచనం జరిగే చోటు) ఎన్ని గంటలకు వస్తావు అని మానసిని అడిగాను. ఆమె 6.00 గంటలకల్లా వస్తానని చెప్పింది. నేను సాయంత్రం 5.30 గంటలకు ఆంటోనియా డిసిల్వా హాల్ వద్దకు చేరుకున్నాను మరియు ఎప్పటిలాగే నా పని చేసుకోసాగాను. 5.45 లేదా 6 గంటల ప్రాంతంలో నిన్ను వెంటనే ఇంటికి రమ్మని పిలుస్తున్నారు అని నాకు కబురు అందింది. నాకు మొదట ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే నన్ను ఇంటికి పిలిచారంటే కచ్చితంగా ఏదైనా సీరియస్ విషయం అయ్యుంటుంది. అందుకే నేను తిరిగి ఇంటికి ఫోన్ చేశాను. మా నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేశారు. నాన్నగారి గొంతు వింటే ఆయన చాలా కంగారు పడుతున్నట్లు అనిపించింది. ఆయన నాతో, మానసి ఆరోగ్యం చాలా పాడైంది, ఆమె కడుపు ఉబ్బిపోతోంది మరియు శరీరం చల్లబడిపోతోంది, నువ్వు వెంటనే ఇంటికి రా అని చెప్పారు. ఈ విషయాన్ని సుచిత్‌దాదా దృష్టికి తీసుకువెళ్లాలని నేను కొద్దిసేపు ఆగాను. కానీ ఆ రోజు దాదా కాస్త ఆలస్యంగా వచ్చారు. అంతలోనే శ్రీ. అజయ్ దళవి మరియు నీతా దళవి నన్ను వెంటనే ఇంటికి వెళ్లమని చెప్పారు మరియు ‘‘మేము దాదాకి చెబుతాములే, ముందు నువ్వు బయలుదేరు’’ అని వాళ్లు అన్నారు.
నేను 7.30 గంటలకు ఇంటికి చేరుకున్నాను. మానసిని చూస్తే ఆమె కదలిక లేకుండా పడి ఉంది. ఆమె కడుపు ఉబ్బిపోయి ఉంది. శరీరం చల్లబడిపోయి ఉంది మరియు కడుపు మీద ఊరికే వేలు పెట్టినా సరే ఆమెకు ప్రాణం పోయేంత నొప్పి వస్తోంది. ఎవరు మాట్లాడినా ఆ శబ్దం కూడా ఆమె భరించలేకపోతోంది. మా ఫ్యామిలీ డాక్టర్ మెహతా కూడా వచ్చారు. కానీ ఆయనకు కూడా ఏమీ అంతుబట్టడం లేదు. ఆయన నాతో, ఈమెను మనం వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం అని చెప్పారు. సుచిత్‌దాదా నుండి కూడా కబురు వచ్చింది, ఆమెను వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ చెయ్యి మరియు ఏమీ కంగారు పడకు అని. దాదా చెప్పిన ఆ ఒక్క మాటతో నాకు చాలా ధైర్యం వచ్చింది.
మా ఫ్యామిలీ డాక్టర్ క్రిటికేర్ హాస్పిటల్‌కి ఫోన్ చేసి మానసి గురించి చెప్పారు. బాపు కృప వల్ల ఆ సమయానికి హాస్పిటల్‌లో సర్జన్, అనస్థీషియన్, సోనోగ్రఫీ చేసే డాక్టర్లు అందరూ అందుబాటులో ఉన్నారు. ఇంటికి అంబులెన్స్ 8.00 గంటలకు వచ్చింది. మానసి నొప్పి చాలా ఎక్కువ అవడంతో ఆమెను స్ట్రెచర్ మీద తీసుకువెళ్లారు. అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి తీసుకువెళ్లేటప్పుడు బండి చిన్న గుంతలో పడినా సరే ఆమె ప్రాణం పోయేంతగా విలవిలలాడిపోయింది. మాలో ఎవరికీ ఏమీ పాలుపోవడం లేదు. ఆమె ఆ పరిస్థితిని చూసి నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. మనసులో బాపు తారక మంత్రం ‘ఓం మనఃసామర్థ్యదాతా శ్రీ అనిరుద్ధాయ నమః॥’ నిరంతరం నడుస్తూనే ఉంది. రాత్రి 8.20 గంటలకు ఆమెను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాము. మానసి బ్లడ్ ప్రెషర్ 80కి పడిపోయింది. డాక్టర్లు సోనోగ్రఫీ చేసి నాతో ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కేసు అని చెప్పారు. మానసి కడుపులో దాదాపు 2 లీటర్ల రక్తం చేరింది. కాబట్టి మనం వెంటనే ఈమెకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మరియు దాని కోసం 5 బాటిళ్ల రక్తం అవసరం పడుతుంది. నేను ఈ విషయాన్ని సుచిత్‌దాదా దృష్టికి తీసుకువెళ్లాను. ఆయన నాకు మళ్లీ ధైర్యం చెప్పారు. డా. అథంగప్రభతి నాకు ఆపరేషన్ ఎంత సీరియస్సో చెప్పారు. ఈ కేసులో పేషెంట్ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరం అంతటా విషం వ్యాపిస్తుంది. డాక్టర్లు నన్ను అక్కడే ఉండమని చెప్పారు. అంతేకాకుండా, మనకు రక్తం దొరికే వరకు మనం ఆపరేషన్ చేయలేము అని డాక్టర్లు చెప్పారు.
నా చెల్లెలు రక్తం తీసుకురావడానికి మలాడ్‌లోని బ్లడ్ బ్యాంక్‌కి వెళ్లింది. రక్తం దొరకగానే అక్కడినుండి బయలుదేరేటప్పుడు ఫోన్ చేయి అప్పుడు మేమిక్కడ ఆపరేషన్ మొదలుపెడతాము అని డాక్టర్లు ఆమెతో చెప్పారు. సరిగ్గా 10 గంటలకు రక్తం దొరికిందని నా చెల్లెలి ఫోన్ వచ్చింది. వెంటనే మానసిని ఓ.టీ. లోకి మార్చారు. అప్పుడు డాక్టర్లు మానసిని, నీకు బాపు మీద ఎంత నమ్మకం ఉంది అని అడిగారు. ఆమె ఏమీ మాట్లాడే మానసిక స్థితిలో లేదు. అదే ప్రశ్నను డాక్టర్లు నన్ను అడిగారు, నీకు బాపు మీద ఎంత నమ్మకం ఉంది అని. నేను వాళ్లతో, 100% ఏది చేసినా బాపునే చేస్తారని చెప్పాను, ఇది విని డాక్టర్ నాతో, అయితే ఇక ఏమీ భయపడకు మానసికి ఏమీ కాదు అని అన్నారు. మరియు డాక్టర్ ఓ.టీ. లోకి వెళ్లారు అప్పుడు సమయం 10.14 అయ్యింది.
10.20 ప్రాంతంలో నా చెల్లెలు రక్తం తీసుకుని వచ్చింది. మూడే బాటిళ్ల రక్తం దొరికింది. మరియు సరిగ్గా అదే సమయానికి సుచిత్‌దాదా డా. జయేష్ షాని పంపించారు. ఆయన కూడా నాకు ధైర్యం చెప్పి ఓ.టీ. లోకి వెళ్లారు. 11.45 ప్రాంతంలో డాక్టర్లు బయటకు వచ్చి ఆపరేషన్ బాగా జరిగిందని చెప్పారు. ఏమీ కంగారు పడకు అని అన్నారు. డాక్టర్లు నన్ను ఓ.టీ. లోపలికి పిలిచి మానసి కడుపులోంచి తీసిన రక్తాన్ని చూపించారు. పెద్ద పచ్చడి జాడీ సైజు బాటిల్ నిండేంత రక్తాన్ని చూపించారు మరియు ఒక పెద్ద పళ్ళెం నిండా బ్లడ్ క్లాట్స్ (జెల్లీలా మందంగా గడ్డకట్టిన రక్తం) చూపించారు. మరియు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కేసులో ట్యూబ్ పగిలిపోతే రక్తస్రావం మొదలవుతుంది అని చెప్పారు. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ కూడా పడిపోతుంది. ఈ కేసులో నొప్పి ఎంత ప్రాణాంతకంగా ఉంటుందంటే ఇందులో బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మరియు ఇలాంటి కేసులో పేషెంట్ చనిపోవడం ఖాయం. మానసి ట్యూబ్ బరస్ట్ అయ్యింది.
ఆ రోజు బాపు ప్రవచనం తర్వాత దర్శనాన్ని మధ్యలోనే ఆపేసి బాపు ఇంటికి వెళ్లిపోయారు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయానికి అక్కడ మానసిని ఓ.టీ. లోకి తీసుకున్నారు. మానసి బ్లడ్ ప్రెషర్ ఏదైతే 60 కి పడిపోయిందో, అటువైపు బాపు బ్లడ్ ప్రెషర్ కూడా పడిపోయింది. మానసి బాధనంతా ఆయన తనపైకి తీసుకున్నారు.
ఏడు రోజుల తర్వాత మానసిని ఇంటికి తీసుకొచ్చాము, ఆ తర్వాత నేను బాపును కలిసినప్పుడు కూడా నేను చాలా ఏడ్చాను. నేను బాపుతో, బాపు మీకు చాలా కష్టంగా అనిపించింది కదూ అన్నాను. అప్పుడు బాపు నవ్వి ఒక్క మాటే అన్నారు, ‘‘వచ్చినవాణ్ణి నేను వెనక్కి పంపించేయాల్సిందే కదా.’’
| Hindi | English |
|---|---|

Comments
Post a Comment