విదేశాలకు బయలుదేరిన ఒక వ్యక్తి... ఇంగ్లీష్ కూడా కేవలం కొద్దిగా మాత్రమే మాట్లాడగలిగేవాడు... చదువు కూడా అంతగా లేదు... విదేశాలకు వెళ్లిన తర్వాత ఇల్లు వెతకడం నుంచి ఉద్యోగం సంపాదించడం వరకు అన్నీ తనంతట తానే చేసుకోవాల్సిన పరిస్థితి... అప్పటివరకు బాపూను కేవలం ఒక సాధారణ వ్యక్తిగా మాత్రమే చూసే దృక్కోణం...
అలాంటి పరిస్థితిలో విదేశాలకు వెళ్లే ముందు శ్రీహరి గురుగ్రామ్కు వెళ్లే భాగ్యం కలుగుతుంది. అక్కడ బాపూ తన లీలతో అతని భయాలన్నింటినీ ఎంతో సులభంగా తొలగిస్తారు. తనకే తెలియకముందే ఆ వ్యక్తి ఒక దృఢ విశ్వాసం కలిగిన శ్రద్ధావంతుడైన బాపూ భక్తుడిగా మారిపోతాడు.
........................................................................................................
సంవత్సరం 2000 నుండి బాపూ గురించి నా భార్య ద్వారా, ఆమె పుట్టింటి వారి ద్వారా తరచూ వింటూ ఉండేవాడిని. కానీ నేను శ్రీస్వామి సమర్థుల భక్తిని మనస్ఫూర్తిగా చేసుకునేవాడిని. కేవలం నా భార్య వినయ బలవంతం వల్లే 2000 సంవత్సరంలో బాపూ పూణేకి వచ్చినప్పుడు, వారి దర్శనం చేసుకున్నాను. అప్పుడు ఈయన ఒక సాధారణ మనిషి, అంతకు మించి ఏమీ లేదు అనిపించింది. కానీ బాపూ చేస్తున్న పనులు, ఆయన ప్రవచనాలు మాత్రం చాలా నచ్చేవి. మనసు మాత్రం ఆయన భక్తి చేయడానికి సిద్ధపడలేదు.
2009 అక్టోబర్ 30న నేను ఆస్ట్రేలియాలో శాశ్వతంగా స్థిరపడేందుకు బయలుదేరాను. నేను పదో తరగతి వరకు చదివి, అనంతరం ఐటీఐలో వెల్డింగ్ కోర్సు పూర్తి చేశాను. 1996 నుండి 2009 వరకు టాటా మోటార్స్లో ఉద్యోగం చేశాను. 2009లో నాకు ఆస్ట్రేలియా 'స్కిల్ మైగ్రేషన్ పర్మనెంట్ వీసా' లభించింది.
నా విమానం అక్టోబర్ 31 ఉదయం ఉండటంతో, నా స్నేహితుడు ముందురోజు ముంబైలో తన ఇంట్లో ఉండమని, అక్కడి నుంచి ఉదయం సులభంగా విమానాశ్రయానికి వెళ్లవచ్చని చెప్పాడు. అక్టోబర్ 30 సాయంత్రం ముంబై చేరుకున్న తర్వాత, "నాకు సిద్ధివినాయకుడి దర్శనం చేసుకోవాలని ఉంది" అని నేను నా స్నేహితునికి చెప్పాను. అయితే మేము ఆలయానికి చేరుకునేలోపే దేవాలయం మూసివేయబడింది.
నా మెడలో నా భార్య ఇచ్చిన బాపూ లాకెట్ను చూసిన నా స్నేహితుడు, నేను బాపూ భక్తుడినని భావించాడు. అప్పుడు అతను, "ఈరోజు గురువారం. నువ్వు ముందుగా బాపూ దర్శనం చేసుకో. రేపు ఉదయం సిద్ధివినాయక ఆలయంలో మొదటి హారతిని దర్శించి, తర్వాత నిన్ను విమానాశ్రయానికి తీసుకెళ్తాను" అని చెప్పాడు.
ఆ సమయంలో నాతో పాటు మా అత్తవారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వెంటనే మేమంతా శ్రీహరి గురుగ్రామ్కు వెళ్లాము.
చిన్న పిట్ట కాళ్లకు దారం కట్టి
దానిని తనవద్దకు లాగి తీసుకొచ్చినట్లే,
అలాగే నన్ను కూడా నిజంగా నీవే నీ వైపుకు ఆకర్షించావు.
నాపట్ల నీకున్న అపారమైన శ్రద్ధ, ప్రేమ నాకు అర్థమైంది.
అక్కడికి వెళ్లేసరికి దర్శనం కోసం చాలా పెద్ద లైన్ ఉంది. రాత్రి పదకొండు గంటలు దాటింది. లైన్ లో మెల్లమెల్లగా ముందుకు వెళ్తుండగా బాపూ నా వైపు చూసి, ‘నువ్వు వెళ్ళు, నేను ఉన్నానుగా, ఏం భయపడకు.’ అని చేతి సైగలతో స్పష్టంగా చెప్పారు. నేను లైన్ లో ముందుకు వెళ్తున్న కొద్దీ, బాపూ నా వైపు చూస్తూ అదే సైగ మళ్లీ మళ్లీ చేయడం నాకు కనిపిస్తూనే ఉంది. తర్వాత నేను సాష్టాంగ నమస్కారం చేశాను. లేచి మళ్లీ బాపూ వైపు చూశాను. ఆ క్షణంలో నాకు ఒక వింత అనుభూతి కలిగి, నా కోసం ఈయనే ఏదైనా చేయగలరు అనిపించసాగింది. బాపూ ఆ సైగ చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి నేను ఆయన వైపు చూసినప్పుడల్లా, బాపూ నాకు అదే చెబుతున్నట్టు కనిపిస్తూ ఉంది.
దర్శనం చేసుకుని నేను మళ్లీ కాస్త దూరం వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాను. లేచి నిలబడితే మళ్లీ బాపూ అదే సైగ చేస్తున్నారు! ఆ క్షణంలో నాకు శ్రీస్వామి సమర్థుల మాటలు గుర్తొచ్చాయి, ‘భయపడకు, నేను నీ వెన్నంటే ఉన్నాను’. రెండు వాక్యాలు ఒకే సంకేతాన్ని ఇస్తున్నాయి. బాపూ చేసిన ఈ సైగ వల్ల నా మనసులో మిగిలి ఉన్న కాస్తో కూస్తో భయం కూడా తగ్గిపోయింది. ఉదయాన్నే లేచి సిద్ధివినాయకుడి దర్శనం చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చాను. బంధువులందరూ నన్ను సాగనంపడానికి వచ్చారు.
ఇప్పుడు నా మనసులోని భయం గురించి క్లుప్తంగా చెబుతాను. కొత్త దేశానికి వెళ్లాలి. విమానం సింగపూర్లో మారాలి. ఇంగ్లీష్ భాష వింటే అర్థమయ్యేది, కానీ మాట్లాడటానికి భయమేసేది. ఆస్ట్రేలియాకు వెళ్లి నేను ఉద్యోగం కూడా వెతుక్కోవాలి. అందువల్ల అక్కడ ఇంటి బయట ప్రతి చిన్న విషయానికి ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి వచ్చేది. కొత్త దేశం, కొత్త జనాలు! అందులోనూ నన్ను ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవడానికి రావాల్సిన వ్యక్తిని నేను 5 ఏళ్ల క్రితం చూశాను. ఆ వ్యక్తిని నేను అక్కడ గుర్తుపట్టగలనా? అనే ప్రశ్న కూడా మనసులో ఉంది. భార్య, పిల్లలను రెండు నెలల్లో అక్కడికి తీసుకెళ్లడం తప్పనిసరి. ముక్కముక్కలుగా చెప్పాలంటే ఇంగ్లీష్ మాట్లాడటానికి, అర్థం చేసుకోవడానికి భయంగా ఉండేది. ఈ భయం బాపూ చేసిన ‘ఆ’ సైగతో ఖచ్చితంగా తగ్గిపోయింది.
31 అక్టోబర్ న సిడ్నీ చేరుకున్నాక విమానం దిగుతున్నప్పుడు మొదట బాపూ పేరు, సిద్ధివినాయకుడి పేరు తలుచుకున్నాను. ఆ రోజు నుండి నేను బాపూ ఛత్రఛాయలోకి వచ్చేశాను. సిడ్నీకి వచ్చిన తర్వాత ఒక సామాన్య మనిషికి, సద్గురు మార్గంలో నడిచే మనిషికి మధ్య తేడా ఏంటో ప్రతి చిన్న చిన్న విషయం ద్వారా నాకు అర్థమవసాగింది. నాకు వెంటనే ఉద్యోగం దొరికింది. నా భార్య, పిల్లలు ఇక్కడికి వచ్చేశారు, వాళ్లు కూడా చాలా త్వరగా సెట్ అయిపోయారు. అక్కడ నేను కొత్తగా ఉన్నప్పుడు నన్ను కలవడానికి వచ్చే జనాలు అనేవాళ్లు, ‘అరే నీకు ఇంత త్వరగా ఉద్యోగం ఎలా దొరికింది? ఎందుకంటే నవంబర్, డిసెంబర్ 2015 లో క్రిస్మస్ సెలవులు ఉంటాయి. ఇలాంటి సమయంలో కొత్త ఉద్యోగం దొరకడం కొంచెం కష్టం.’ కానీ ప్రతి విషయంలోనూ బాపూ ఉన్నారనే నమ్మకం కలిగేది, ఆయన గుర్తోచ్చేవారు. ‘భయపడకు, నేను నీ వెన్నంటే ఉన్నాను’, అని బాపూ నాతో చెబుతున్నట్టే అనిపించేది. 2009 నుండి 2013 వరకు నేను బాపూని ఏది అడిగినా ఆయన నాకు ఇచ్చారు. ఈ రోజు నా జీవితంలో బాపూ నాకు ఇవ్వనిదంటూ ఏదీ లేదు. నేను నా ప్రతి అనుభవాన్ని నాకు కలిసే ప్రతి బాపూ భక్తుడికి, నా స్నేహితులకు చెబుతుంటాను.
బాపూ! నీవు నేనూ స్వభావతః ఏకమై కలిసినప్పుడు,
సహజంగానే అద్వైత స్థితి ఆవిర్భవిస్తుంది.
అసాధ్యాన్ని సైతం సాధ్యంగా చేయగలవు నీవే.
నీ అనంతమైన లీలలను దర్శిస్తూ నేను పరవశించిపోయాను.
అనిరుద్ధా! నీకు నేను ఎంత ఋణపడి ఉన్నానో!
అనిరుద్ధా! నీకు నేను ఎంత ఋణపడి ఉన్నానో!॥
| Hindi | English |
|---|---|

Comments
Post a Comment