దుఃఖ బంధనాల నుండి విముక్తినిచ్చే ‘రామబాణం’
సద్గురు శ్రీ అనిరుద్ధ బాపు రామరక్షా స్తోత్రమంత్ర మాలికలోని 7వ ప్రవచనంలో చెబుతున్నారు, ఆకాశం నుండి పడే ప్రతి చుక్క చివరకు సముద్రాన్నే ఎలా చేరుతుందో, అలాగే ఏ భాష నుండి లేదా ఏ ప్రాంతం నుండి వచ్చినా భగవంతుని వివిధ పవిత్ర స్వరూపాల భక్తి చివరికి ఆ పరమేశ్వరుడికే చేరుతుంది. ఈ భక్తికి, ప్రేమకు ఎటువంటి బంధనాలు ఉండవు. కానీ మానవ జీవితంలో దుఃఖాలనే అనేక బంధనాలతో మనం కట్టబడి ఉన్నాం, దాని నుండి విముక్తి కలిగించే నిజమైన ఉపాయం అంటే ’రామబాణం’. అందుకే మనం ‘రామబాణ ఉపాయం’ లేదా ‘రామబాణ ఔషధం’ అనే పదాలను ఉపయోగిస్తాము.
‘ధృతశరధనుషం’ – చేతిలోని ధనుస్సుకి బాణం సంధించిన రాముడు
రామరక్షా ధ్యానమంత్రంలో రాముని వర్ణన “ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం” అని ఉంది, అంటే ఎవరైతే చేతిలో ధనుర్బాణాలను ధరించి ఉన్నారో ఆ రాముడు. రాముడు ఎప్పుడూ కేవలం ధనుర్బాణాలను ధరించే కనిపిస్తాడు, వేరే ఏ ఇతర ఆయుధాన్ని అతడు ధరించడు. అందుకే బుధకౌశికుడు అంటే విశ్వామిత్ర మహర్షి, చేతిలోని ధనుస్సుకి బాణం సంధించిన స్థితిలో ఉన్న రాముడిని ధ్యానం చేయమని చెబుతున్నారు.
రాముని బాణానికి ఉన్న ఏడు అద్వితీయ లక్షణాలు
సద్గురు శ్రీ అనిరుద్ధులు ఈ ప్రవచనంలో రాముని బాణానికి ఉన్న ఏడు అద్వితీయ లక్షణాల గురించి వివరించారు. అందులో మొదటిది ఏమిటంటే, రాముని బాణం ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది మరియు ఆ బాణం యొక్క ఖచ్చితత్వం, పనితీరు రాముని కోరిక మేరకు ఉంటుంది. రాముని కోరిక మేరకు బాణం శత్రువు గుండె నుండి దూసుకుపోయినా, అతని ప్రాణాలను తీయకూడదనుకుంటే, అలాగే జరుగుతుంది. ఈ బాణం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అది కేవలం చెడును మాత్రమే నాశనం చేస్తుంది మరియు ఎప్పుడూ పొరపాటు చేయదు.
సైతాన్ అంటే అభావం (లేమి) – రామబాణం అంటే భావ నిర్మితి
పరమేశ్వరుడు ఎప్పుడూ ఎవరికీ చెడు చేయడు. పరమేశ్వరుడు భావస్వరూపుడు. పరమేశ్వరుని అభావం నా మనసులో పుట్టడమే సైతాన్. అందుకే అభావానికి అంటే సైతానుకి వేరే ఉనికి లేదు. ఎప్పుడైతే పరమేశ్వరుడు కేవలం సాక్షిరూపంలో ఉంటాడో, అతని క్రియాశీలత ఎక్కడ ఉండదో అక్కడే సైతానీ వృత్తి ఉదయిస్తుంది మరియు రామబాణం ఎప్పుడైతే ఇలాంటి సైతాన్ గుండె మీద నుండి, సైతానీ వృత్తి ఉన్న మనిషి గుండె మీద నుండి వెళ్తుందో, అప్పుడు అది భావాన్ని పుట్టిస్తుంది. రామబాణం కచ్చితమైనది; తప్పులను సరిదిద్దేది.
సద్గురు అనిరుద్ధ బాపు ఒక కథ ద్వారా వివరిస్తున్నారు, రాముని బాణం అభావాన్ని పోగొట్టడానికి వేరే చోటు నుండి ఏమీ తీసుకురాదు, కానీ ఎక్కడైతే అభావం ఉందో అక్కడే భావాన్ని సృష్టిస్తుంది. ఉదాహరణకు, రాముడు ఒక నిర్దిష్ట స్థలంలో బాణం వేసి గంగను తీసుకురావాలంటే, ఆ నిర్దిష్ట స్థలం నుండి గంగ ఉన్న చోటి వరకు తన బాణంతో భూమిని చీల్చి గంగను తీసుకురావడానికి బదులు, రాముడు ఎక్కడ బాణం వేస్తాడో అక్కడే గంగ పుడుతుంది. రాముడు ధనుస్సుకి బాణం సంధించినాడు అని మనం అతన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ బాణం నాలోకి వచ్చి నాలోని చెడు అంతా దూరం చేయబోతోంది, నా ప్రారబ్దాన్ని నాశనం చేయబోతోంది అనే ఆలోచన ఎప్పుడైతే నా మనసులో అధికాధికంగా దృఢంగా మారుతుందో, దానివల్ల నా అష్టభావాలు మేల్కొని నా కళ్ళ నుండి నీళ్లు కారడం మొదలవుతాయో, అది గంగ అవుతుంది, రాముని బాణం వల్ల పుట్టిన గంగ అవుతుంది, అది నా పూర్తి జీవితానికి పవిత్రతను ఇస్తుంది.
గాయాన్ని నయం చేసి (మాన్పి) తిరిగి వచ్చే రామబాణం
రాముని బాణం యొక్క రెండో ప్రత్యేకత ఏమిటంటే రాముడు తన బాణాన్ని ఏ దిశలో పంపిస్తాడో అదే దిశలో తిరిగి వస్తుంది. ఈ బాణం వల్ల ఏ గాయం అయిందో అదే గాయాన్ని నయం చేస్తూ (మాన్పుతూ) ఆ బాణం తిరిగి వస్తుంది. గాయం అయింది అంటే శరీరంలోని కణాల అభావం ఏర్పడింది అని అర్థం. ఆ అభావం యొక్క రూపాంతరాన్ని భావంలో చేయడానికి ఆ బాణం మళ్ళీ అదే దిశలో తిరిగి వస్తుంది అంటే అతని అక్షయతూణీరంలోకి తిరిగి వస్తుంది.
వేదనలేకుండా, రక్తస్రావం లేకుండా ఉండే రామబాణం
మూడో ప్రత్యేకత ఏమిటంటే రాముని బాణానికి ఎప్పుడూ రక్తం అంటుకోదు మరియు రామబాణం ఎప్పుడూ నొప్పిని ఇవ్వదు. రాముని బాణం ఎప్పుడైతే ఏ జీవి శరీరంలోకైనా వెళ్తుందో, ఆ జీవి ఎంత పాపి అయినా లేదా పుణ్యాత్ముడైనా సరే, అతని శరీరం రాముని బాణాన్ని స్వాగతిస్తుంది. ఆ బాణానికి జీవి శరీరం యొక్క ప్రతి భాగం దారి ఇస్తుంది.
108 శక్తి కేంద్రాలను జాగృతం చేసే రామబాణం
నాల్గవ విశేషం ఏమిటంటే, రాముని బాణం శరీరంలోని ఏ భాగం ద్వారా వెళ్లినప్పటికీ, అది శరీరమంతటా ఉన్న అన్ని 108 శక్తికేంద్రాలను జాగృతం చేస్తుంది.
ఆవాహన/సవాలు లేకుండా వెళ్ళని రామబాణం
రాముని బాణం యొక్క ఐదో ప్రత్యేకత ఏమిటంటే ఎదుటివారు ఆవాహన చేయకుండా లేదా సవాలు (ఆహ్వానం) ఇవ్వకుండా రాముడు బాణం ఎప్పుడూ వదలడు. బాణం కేవలం ఆవాహన లేదా సవాలు అయిన తర్వాతే వస్తుంది. రాముడు పూర్ణ సత్వగుణుడు కాబట్టి అతను అచలుడు (Masterly Inactive). మనం అతన్ని ఎప్పటి వరకు ఆవాహన చేయమో అప్పటి వరకు అతను కదలడు మరియు బాణం వదలడు. రాముని ప్లాన్ ఎప్పుడూ ఎదుటి వ్యక్తి బట్టే నిర్ణయించబడుతుంది. అందుకే అతన్ని కదిలించడానికి రావణుడి కంటే హనుమంతుని లాంటి భక్తులు కావడం ఎప్పుడూ మంచిది.
ప్రేమ మరియు ద్వేషాన్ని బట్టి అవసరమయ్యే రామబాణాల సంఖ్య
ఆరో ప్రత్యేకత ఏమిటంటే మన రాముని మీద ప్రేమ మరియు భక్తి ఎంత గాఢంగా ఉంటాయో, అంత తక్కువ బాణాల అవసరం పడుతుంది; దీనికి విరుద్ధంగా ద్వేషం ఎంత ఎక్కువ ఉంటే, అంత ఎక్కువ బాణాలు అవసరం పడతాయి. దీని గురించి సద్గురు అనిరుద్ధ బాపు చెబుతున్నారు, రాముడు రావణుని కోసం అసంఖ్యాక బాణాలను వాడాడు కానీ మనం ముందటి ప్రవచన కథలో విన్నట్టు హనుమంతునికి వేసిన ఒకే బాణంతో రాముడు స్వయంగా గాయపడ్డాడు.
ధ్యాస కలిగినప్పుడే ఫలించే రామబాణం
రాముని బాణం యొక్క ఏడవ లక్షణం ఏమిటంటే, ఎదుటి వ్యక్తి శత్రుత్వంతో లేదా స్నేహంతో రాముని ధ్యాస పెట్టనంత వరకు రాముని బాణం బయలుదేరదు. మరియు మనకు ఒకసారి రాముని ధ్యాస పడితే, రాముని బాణం బయలుదేరుతుంది మరియు రాముడికి కూడా మన ధ్యాస పడుతుంది.
సంత కబీర్ దాస్ అంటారు - “రామ్ హమారా జప్ కరే, హమ్ బైఠే ఆరామ్”! అంటే, భక్తుడు రాముని ధ్యాస పెట్టినప్పుడు, రాముడికి కూడా భక్తుని ధ్యాస పడుతుంది. ప్రాపంచిక జీవితంలో ఏ ధ్యాస అయినా పెట్టుకోవచ్చు, కానీ రాముని ధ్యాస మాత్రం ఎప్పుడూ ఉంచాలి; రాముని ఏ రూపమైనా, కృష్ణుడు అయినా, మహావిష్ణువు అయినా లేదా వేరే అయినా, అతను ఒక్కడే. ఇటువంటి 7 లక్షణాలు ఉన్న బాణాన్ని రాముడు తన ధనుస్సుకు సంధించాడు. ఈ ధనుస్సు కూడా ప్రత్యేకమైనది. దీనికి మూడు లక్షణాలు ఉన్నాయి.
రాముని నిరాకార ధనుస్సు
రాముని ధనుస్సు నిరాకారమైనది, అంటే దానికి ఎటువంటి నిర్దిష్ట ఆకారం లేదు. అది రాముని కోరిక మేరకే కావలసిన ఆకారాన్ని కావాల్సినప్పుడు ధరించగలదు.
స్థిరత్వాన్ని ఇచ్చే రాముని ధనుస్సు
రాముని ధనుస్సు సదా అధః-ఊర్థ్వ (కింద-పైన) ఈ రెండు దిశలలో స్థిరంగా ఉంటుంది. అంటే అది నిటారుగా ఉంటుంది, వంకరగా ఉండదు. ఈ ధనుస్సు బాణానికి యోగ్యమైన గతిని మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది. రాముని ధనుస్సు యొక్క అధః కొన అంటే కింది కొన బాణాన్ని సంధించినప్పటికీ నేలను తాకి ఉంటుంది, పృథ్వితో సంబంధాన్ని సూచిస్తుంది, అందుకే అది స్థిరంగా ఉంటుంది. రాముడు తన భక్తునికి అతని ఉపాసన యొక్క ఏ ఫలితం భరించగలడో తెలుసు మరియు అంతే ఫలితాన్ని ఇస్తాడు.
ఎల్లప్పుడూ కార్యనిరతమైన రాముని ధనుస్సు
రాముని అవతారానికి ముందు మరియు తర్వాత కూడా ఈ ధనుస్సు సక్రియంగా ఉంది. ప్రత్యక్షంగా రాముని ధనుస్సు అంటే హనుమంతుడు. హనుమంతుడు అంటే రాముని ధనుస్సు, మరియు అతని గద అంటే రామనామం. అందుకే ఎక్కడ రామనామం ఉందో అక్కడ హనుమంతుడు తప్పక ఉంటాడు. రామ-హనుమంతుల బంధం విడదీయరానిది.
రాముని ఆయుధాలు మరియు లక్ష్మణుడు, సీత ఇంకా హనుమంతుడు
సద్గురు శ్రీ అనిరుద్ధులు ఇంకా చెబుతున్నారు, రాముని ధనుస్సు, రాముని బాణం మరియు రాముని అమ్ములపొది (భాతా) ఈ మూడు ఆయుధాల యాజమాన్యం వాస్తవానికి రాముని వద్ద లేదు, బదులుగా వాటి సంరక్షణ మరియు నియంత్రణ మహాశేషుడు లక్ష్మణుడు చేస్తాడు, అంటే రాముని బాణం, రాముని ధనుస్సు మరియు రాముని అంబులపొదిని రాముని శరీరం నుండి తీసి ఉంచడం మరియు తిరిగి రాముని శరీరానికి అమర్చడం ఈ పనిని కేవలం ఆ ఒక్క మహాశేషుడు లక్ష్మణుడు మాత్రమే చేయగలడు.
రాముని ధనుస్సు అంటే హనుమంతుడు మరియు ఈ ధనుస్సును ఉపయోగించాలనే సంకల్పం అంటే సీతామాత. రాముని బాణం యొక్క కార్యం ఏమిటంటే మన జీవితంలో ఏ పురుషార్థం అయితే వెళ్ళిపోయిందో లేదా ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి లేదా మర్యాద ఈ పురుషార్థాల ఏ అభావం (లేమి) పుట్టిందో ఆ పురుషార్థాన్ని మళ్ళీ సిద్ధం చేయడం. ఇందుకోసం మనం రామరక్ష పఠించేటప్పుడు రాముని ధ్యానం చేస్తూ ‘ధృతశరధనుషం’ రాముడు అంటే అతని అమ్ములపొదితో, బాణంతో మరియు ధనుస్సుతో సహా రాముడిని మన కళ్ళ ముందు తీసుకురావాలి.
దేవుని శరణు వెళ్లాలనే తపనను కలిగించే ధ్యానమంత్రం
చివరగా బాపు చెబుతున్నారు ధ్యానమంత్రం జపిస్తున్నప్పుడు ఎంత సాధ్యమైతే అంత ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం రామరక్ష పఠిస్తున్నప్పుడు గానీ, ధ్యానం చేస్తున్నప్పుడు గానీ ఒక్కో పదంపై దృష్టి పెట్టినా చాలు. అయితే ధ్యానమంత్రం చేసే పని ఏమిటి? ఈ ధ్యానమంత్రం వల్లనే నాకు దేవుని నామంపై మమకారం కలుగుతుంది, దేవుని స్తుతిపై మమకారం కలుగుతుంది, దేవుని రూపంపై మమకారం కలుగుతుంది. నాకు దేవునికి శరణు వెళ్లాలనే తపన కలుగుతుంది. ఈ సమస్త పనులను చేయింపజేసేది ధ్యానమంత్రం.
--------------------

Comments
Post a Comment